విశాఖ : రాగల 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఉత్తరప్రదేశ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల అవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావం వల్ల రాష్ట్రంలో అక్కడక్కడ వానలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.




