Thursday, 5 November 2026

రేషన్‌ డీలర్లకు కనీస వేతనం ఇవ్వాలి

ఏలూరు,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి)
: రేషన్‌ డీలర్లకు జీవనభృతి కల్పించాలని రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘ నాయకులు కోరారు. నెలకు కనీసం రూ.15 వేల ఆదాయం రేషన్‌ డీలర్లకు లభించేలా చూడాలన్నారు. జీపీఎస్‌ విధానం ద్వారా రేషన్‌ దుకాణాలకు ఏవిధమైన రవాణా, దిగుమతి ఛార్జీలు లేకుండా సరకులు రవాణా చేయాలని కోరారు. ఈ మేరకు ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి జాయింట్‌ కలెక్టర్‌కు విన్నవించినట్లు చెప్పారు. రేషన్‌ దుకాణాల్లో ఈ-పాస్‌ విధానాన్ని ప్రవేశపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నందున డీలర్ల జీవనభృతికి ఆటంకం కలుగుతుందని వినతి పత్రంలో పేర్కొన్నారు. రేషన్‌ దుకాణం నిర్వహణకు, కుటుంబ పోషణకు తగిన ఆదాయం లభించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలావుంటే జిల్లాలోని అన్ని రేషన్‌ దుకాణాల్లో మార్చి 1 నుంచి ఈ-పాస్‌ విధానాన్ని అమలుచేయనున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు తెలిపారు. ఈ-పాస్‌ విధానంలో ఎలక్టాన్రిక్‌ యంత్రాలు ఇంటర్‌నెట్‌తో  అనుసంధానంతో పనిచేస్తాయని తెలిపారు.  తూనికలను ఉపయోగించేలా డీలర్లకు త్వరలో శిక్షణ అందిస్తామని జేసీ చెప్పారు. రేషన్‌ డీలర్లు ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావచ్చన్నారు. వినియోగదారుల రేషన్‌ కార్డులను దీనికి  అనుసంధానం చేయడం ద్వారా ఎవరికి ఎంతమేర సరకులు పొందే అర్హత ఉంటుందో నమోదై ఉంటుందని చెప్పారు. తద్వారా వినియోగదారులు పొందిన సరకుల వివరాలు ఎప్పటికప్పుడు హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులు తెలుసుకోవడానికి వీలవుతుందని చెప్పారు. వినియోగదారులు పొందే సరకులకు సంబంధించి తూనికల్లో ఈ యంత్రం ద్వారా ఏ చిన్న పొరపాటు జరగడానికి తావుండదని చెప్పారు. త్వరలో చౌకడిపోల ద్వారా పింఛన్లు కూడా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుందని జేసీ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *