అనంతపురం,మార్చి26 (జనంసాక్షి) : విద్యుత్ ఛార్జీల పెంపుపై వైకాపా, కాంగ్రెస్ పార్టీలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని జిల్లా తెలుగుదేశం పార్టీ విమర్శించింది. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని స్వల్పంగానే ఛార్జీలు పెంచడం జరిగిందని, ఈ అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ధ్వజమెత్తారు. పేదలు, మధ్య తరగతి వర్గాలపై ఎలాంటి భారం ఉండదని చెప్పారు. ఎమ్మెల్సీగా హ్యాట్రిక్ సాధించిన గుండుమల తిప్పేస్వామి వైకాపా తీరును తప్పు పట్టారు. అసెంబ్లీలో రోజూ ఏదో ఒక విషయంతో సభాసమయాన్ని వృధా చేశారని అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి ఆయన తెదేపాలోకి చేరారు. మడకశిర నియోజకవర్గానికి చెందిన తిప్పేస్వామి సర్పంచి ఎన్నికల నుంచి ఎమ్మెల్యే ఎన్నికల వరకు తెదేపా విజయానికి కృషి చేశారు. ఊహించనివిధంగా తెదేపా ఎమ్మెల్యేల కోటా నుంచి ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. ఆయన ఎమ్మెల్సీగా అధికారికంగా డిక్లరేషన్ అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యధికంగా విద్యుత్ వినియోగించే సంపన్న వర్గాలపై స్వల్పంగా పెంచారని వివరించారు. కోతలు లేకుండా నిరంతర విద్యుత్‌ను అందిస్తున్న ఘనత తెదేపా ప్రభుత్వానిదేనన్నారు. 24 గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తుండడంతో పారిశ్రామిక వేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తున్నారని గుర్తు చేశారు. ప్రజలు అర్థం చేసుకుని సహకరిస్తుంటే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి రాజకీయ దురుద్దేశంతో విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఇకనైనా ఆరోపణలు మాని రాష్టాభ్రివృద్ధికి సహకరించాలని హితవు పలికారు.




