Wednesday, 4 November 2026

వేదావతిపై అక్రమ కట్టడాలే దెబ్బతీస్తున్నాయి

అనంతపురం,మార్చి3(జ‌నంసాక్షి): కర్ణాటకలో వేదావతి నదిపై నిర్మించిన అక్రమ కట్టడాలతో గత 20 ఏళ్లలో బీటిపి కింద ఆయకట్టుకు ఒక్కసారి కూడా నీరు అందలేదని చీఫ్‌విప్‌, ఎమ్మెల్యేకాలవ శ్రీనివాసులు అన్నారు. వర్షాభావంతో రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లోని వందలాది చెరువులు ఎండిపోయాయన్నారు. కరవుకు నిలయమైన రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల ప్రజల ఆశలుతీర్చే బిటిపి రైతులను ఆదుకునేందుకు హంద్రీనీవా జలాలను మళ్లించటమే శరణ్యమని ఎమ్మెల్యే తెలిపారు. రెండు నియోజకవర్గాల్లో రెండు దశాబ్దాలుగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో వ్యవసాయభూములు బీళ్లుగా మారటంతో రైతులు, వ్యవసాయకూలీలు పొట్ట చేత పట్టుకుని వలస వెళ్లారన్నారు. లక్షలాది రుపాయలను వెచ్చించి వ్యవసాయ బోర్ల కింద రైతులు సాగు చేసిన ఉద్యాన వన పంటలు ఎండిపోయాయన్నారు. వర్షాభావంతో భూగర్భజలాలు అడుగంటడంతో గ్రామాల్లోతాగునీటి ఎద్దడి తీవ్రమయిందన్నారు.  కరవు జిల్లాలో అత్యంత వెనకబడిన రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల ప్రజలను ఆదుకునేందుకు జీడిపల్లి జలాశయం నుంచి కృష్ణా జలాలను రెండు నియోజకవర్గాల్లోని చెరువులు, బి.టి.ప్రాజెక్టుకు మళ్లించి వలసలకు అడ్డుకట్ట వేయాలని అన్నారు.  కరువు కారణంగా పశువులకు గ్రాసం కరవై కబేళాలకు విక్రయిస్తున్నారని చెప్పారు. రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్‌, కణెళికల్లు మండలాల్లో వేలాది ఎకరాల్లో ఏర్పడిన ఇసుక దిబ్బలే ఎడారీకరణకు నిదర్శనమన్నారు. బెళుగుప్ప మండలం జీడిపల్లి నుంచి 61 కిలోవిూటర్ల దూరంలోని కుందుర్పి ఉపకాలువ నిర్మించాల్సి ఉందని చెప్పారు. . దీని ద్వారా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 114 చెరువులకు నీరివ్వటంతో బీటిపికి, చెరువులకు రెండు టీఎంసీల నీరు ఇవ్వొచ్చన్నారు. ఈ వివరాలను మంత్రి దేవినేనికి సమర్పించామన్నారు. ఈ విసయాలను తాను స్వయంగా సిఎం దృష్టికి తీసుకుని వెళతానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *