కర్నూలు,మార్చి2(జనంసాక్షి): పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రాయలసీమ రైతాంగాన్ని ఆదుకోవాలని రాయలసీమకు చెందిన నేతలు డిమాండు చేశారు. పోతిరెడ్డిపాడు పనులను పూర్తి చేసి ఇక్కడినుంచి దిగువకు 44 వేల క్యూసెక్కుల నీటిని తరలించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. శ్రీశైలం నీటిమట్టాన్ని 854 అడుగుల మేర ఉంచాలని ఉత్తర్వు ఉన్నా ప్రస్తుతం 834 అడుగులకు తగ్గించి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు కోసం వాడుతుంటే.. కోస్తా సాగునీటి కోసం మిగిలిన నీటిని తరలించుకుపోతూ పోతిరెడ్డిపాడు కింద ఉన్న పంట పొలాలకు నీరందకుండా రాయలసీమ రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ ప్రాజెక్టులను సత్వరం పూర్తిచేయాలని ప్రభుత్వంపై వత్తిడి తీసుకురానున్నట్లు తెలిపారు. శ్రీశైలం జలాశయంలో నీటి వనరులు తగ్గడంతో రాయలసీమ రైతులకు తీరని నష్టం కలుగుతోందని వైకాపా ఎమ్మెల్యేలు అన్నాచారు. శ్రీశైలం జలాశయం ఆనకట్టను కడప జిల్లా వైకాపా ఎమ్మెల్యేలు సందర్శించారు. రాష్టాన్న్రి రెండుగా విడగొడితే జలయుద్దాలు తప్పవని వైకాపా ఆనాడే చెప్పిందన్నారు. ముఖ్యమంత్రులు ముందుచూపు లేకుండా వ్యవహరించడంతో నేడు జలాశయంలో నీటిమట్టం తగ్గిపోయి రైతులకు నష్టం కలుగుతోందన్నారు. జలాశయంలో నీటిమట్టం తగ్గకుండా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ గతంలో చర్యలు తీసుకున్నారన్నారు. విద్యుత్తు డిమాండు ఉంటే పక్క రాష్టాల్ర నుంచి కొనుగోలు చేసుకోవాలని, నీరు ఇష్టానుసారం వాడేస్తే ఎక్కడ నుంచి వస్తాయని వారు ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు, హెచ్ఎన్ఎస్ఎస్, జీఎన్ఎస్ఎస్, వెలిగొండ ప్రాజెక్టులకు శ్రీశైలం జలాలు అందేలా చూడాల్సిన బాధ్యత చంద్రబాబుదే అన్నారు. రాయలసీమ ప్రాజెక్టుల్లో నీటి వనరులు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకున్నారు.




