Tuesday, 3 November 2026

ఇదే చివరి నవంబర్‌ 1 నిరసన

గన్‌పార్క్‌ వద్ద నిరసన
దోచుకున్నవాళ్లే హైదరాబాద్‌పై హక్కులడుగుతున్నారు : కోదండరామ్‌
హైదరాబాద్‌, నవంబర్‌ 1 (జనంసాక్షి) :
నవంబర్‌ 1న ఇదే చివరి నిరసన అని, వచ్చే సంవత్సరం నుంచి తెలంగాణలో విద్రోహ దినంగా పాటించే అవసరం రాదని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని టీ జేఏసీ విద్రోహ దినంగా పాటించాలని పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా శుక్రవారం కోదండరామ్‌ జేఏసీ కార్యాలయం వద్ద నల్ల జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమన్నారు. కొత్త సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలోనే అన్నీ జరుపుకుందామన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణను అడ్డుకోలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల నిరసనలకు తాము నిలువెత్తు సాక్ష్యంగా నిలబడతామన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా తెలంగాణ తెచ్చే సత్తా తమకు ఉందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు ఆయన తెలిపారు. గన్‌ పార్కు అమర వీరుల స్థూపం వద్ద శుక్రవారం తెలంగాణ యూనైటెడ్‌ ఫ్రంట్‌ (టఫ్‌) నిరసన తెలిపింది. టఫ్‌ నాయకులు విమలక్క, ఎమ్మెల్సీ దిలీప్‌కుమాపర్‌ తదితరలు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా దిలీప్‌కుమార్‌ మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్‌ చేశారు. అఖిలపక్షం పేర తాత్సారం చేస్తే సహించేదిలేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, చంద్రబాబునాయుడు తెలంగాణను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతుతున్నారన్నారు. రాష్ట్రపలి పాలన విధించైనా తెలంగాణ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా విమలక్క ఆలపించిన గీతాలు పలువురిని అలరింపజేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *