మాట ఇచ్చాం..తెలంగాణ తెచ్చాం: రాహుల్ గాంధీ
టిఆర్ఎస్ పాత్ర లేదు..టిడిపి, బిజెపి అడ్డుకున్నాయి

మహబూబ్‌నగర్ (జనంసాక్షి) : తెలంగాణ ప్రజల 60 ఏళ్ల స్వప్నాన్ని సాకారం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కుతుందని, ఇందులో తెలంగాణ రాష్ట్ర సమితికి ఎటువంటి పాత్ర లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన అనంతరం తొలిసారి తెలంగాణలో అడుగుపెట్టిన రాహుల్ గాంధీ సోమవారం మహబూబ్ నగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. ముందుగా, 60 ఏళ్ల తెలంగాణ కల జూన్ 2వ తేదీన సాకారమవుతున్నందుకు తెలంగాణ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అన్ని వర్గాల ప్రజలకు ఆయన అభినందనలు తెలియచేస్తూ ఉద్యమం కోసం అసువులు బాసిన అమరులకు ఆయన నివాళులర్పించారు. ఈ స్వప్నాన్ని సాకారం చేయడంలో కాంగ్రెస్ పాత్ర ప్రధానమైనదని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ పాత్ర లేకుండా ఈ కల నెరవేరి ఉండేది కాదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల ఉద్యమాన్ని గౌరవించి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య ప్రక్రియను చేపట్టిందని ఆయన తెలిపారు. రెండు రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలను, ఆశయాలను తాము నెరవేరుస్తామని ఆయన చెప్పారు. తాము శుష్కవాగ్దానాలు చేయబోమని, చెప్పింది చేసి చూపిస్తామని రాహుల్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావాన్ని టిడిపి అడుగడుగునా అడ్డుకుందని ఆయన చెప్పారు. రాజ్యసభలో తెలంగాణ బిల్లును అడ్డుకోవడానికి బిజెపి ఎన్ని ఆటంకాలు సృష్టించిందో దేశ ప్రజలంతా చూశారని రాహుల్ చెప్పారు. తెలంగాణ బిల్లు రూపకల్పనలో కాని, బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందడంలో కాని టిఆర్ఎస్ ప్రమేయం ఎక్కడా లేదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దశాబ్దం క్రితమే తెలంగాణ ఏర్పాటు ఆలోచనకు ప్రాణం పోసిందని ఆయన చెప్పారు. టిఆర్ఎస్ వాగ్దానాలు చేయడంలో ముందుంటుందని, కాని వాటిని నెరవేర్చడంలో మాత్రం విఫలమవుతుందని రాహుల్ ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే టిఆర్ఎస్ ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని సాక్షాత్తు ఆ పార్టీ అధ్యక్షుడే కాంగ్రెస్ నాయకత్వానికి మాట ఇచ్చారని రాహుల్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తామని ఆ పార్టీ వాగ్దానం చేసిందని కూడా రాహుల్ గుర్తు చేశారు. అన్ని వాగ్దానాలను ఆ పార్టీ అధ్యక్షుడు మరచిపోయారని, ఇప్పుడు ఎన్నికల వేళ చేస్తున్న అన్ని వాగ్దానాలను ఆ పార్టీ మరోసారి మరచిపోతుందని ఆయన ఎద్దేవాచేశారు. టిఆర్ఎస్, ఆ పార్టీ అధ్యక్షుడికి అధికారమే పరమావధని ఆయన వ్యాఖ్యానించారు.దేశాన్ని ఎలా పాలించాలో, రాష్ట్రాలను ఎలా ప్రగతిపథంలో నడిపించాలో కాంగ్రెస్‌కు మాత్రమే తెలుసునని ఆయన చెప్పారు. ‘మేడిన్ తెలంగాణ’ అన్న లోగోతో తెలంగాణ దేశంలోనే అద్భుతమైన పారిశ్రామిక రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆవిర్భావం ద్వారా దక్కాల్సిన ఫలాలన్నీ అన్ని వర్గాలకు దక్కాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. తెలంగాణలో ప్రగతి సాధించాలంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని, హైదరాబాద్‌లోని సంపద అంతా తెలంగాణకే చెందుతుందని రాహుల్ తెలిపారు. అభివృద్ధి కేవలం ఒక్క రాజధాని నగరానికి పరిమితం కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అభివృద్ధి జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆయన చెప్పారు. లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాంగ్రెస్ మాత్రమే పరిరక్షించగలదని, బిజెపి హిందూ, ముస్లిముల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు.రాహుల్ ప్రసంగానికి ముందు కేంద్ర మంత్రి, మహబూబ్ నగర్ లోక్ సభ అభ్యర్థి ఎస్. జైపాల్ రెడ్డి, నాగర్ కర్నూల్ లోక్ సభ అభ్యర్థి నంది ఎల్లయ్య, టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి డికె అరుణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ప్రసంగించారు. రాహుల్ ప్రసంగాన్ని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ తెలుగులోకి అనువదించారు.
Related