Tuesday, 3 November 2026

జల దిగ్బంధంలోనే లంక గ్రామాలు

ఐ. పోలవరం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. దీంతో ఉభయ గోదావరి జిల్లాలను  వరద అతలాకుతలం చేస్తోంది. పెరుగుతున్న నీటి ప్రవాహంతో లంక గ్రామాల వాసుల బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వర వద్ద ఉదయం 6 గంటలకు గోదావరి నీటిమట్టం 17.01 అడుగులకు చేరుకుంది. ఐ. పోలవరం మండలం తీరప్రాంతాల్లోని లంక గ్రామాలను వరద చుట్టుముట్టింది. గోగుళ్లలంక, భైరవలంక, పలాజవారిపాలెం, పేరుళ్లలంక, చింతపల్లిలంక, కొత్తలంక, వలసలదిబ్బ పుట్టతిప్ప, సీతారాంపురం గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. ఎగువ నుంచి వస్తున్న వరదనీటితో గౌతమి, వృద్ధగౌతమి గోదావరి నదీపాయలు ఉరకలెత్తుతున్నాయి. గుత్తెరదీవిలోని నార్త్‌ అద్దాలకాలువ నుంచి వరద నీరు ఐ. పోలవరం మండలంలోకి ప్రవేశించి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతోంది. మంత్రి విశ్వరూప్‌ వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *