విశాఖ: రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల అవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీనికి తోడు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ద్రోణి, ఉపరితల అవర్తనం వల్ల కోస్తాంధ్ర, తెలంగాణలో పలు చోట్ల , రాయలసీమలో అక్కడకక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.




