Tuesday, 3 November 2026

సీమాంధ్రలో పట్టుకోసమే జగన్నాటకాలు: వినోద్‌


హైదరాబాద్‌, అక్టోబర్‌ 27 (జనంసాక్షి):
సీమాంధ్రలో పట్టుకోసమే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ వినోద్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో జరిగిన సమైక్యశంఖారావం సభలో జగన్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత సీమాంధ్రలో ఆధి పత్యం కోసమే టీడీపీ అధినేత చంద్రబాబు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిలు పోటీపడుతున్నారని విమర్శించారు. ప్రజలను దోచుకోవడానకే జగన్‌ రాజకీయాల్లోకి వచ్చారన్నారు. చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని సూచించారు. రాష్ట్రం విడిపోతే జగన్‌కు30 స్థానాలు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. ఆయనకు మతిభ్రమించినట్లుందన్నారు. విభజన తర్వాత తెలంగాణ ఆగిపోతుందని, ఆస్తుల విలువలు పడిపోతాయని చెబుతున్నారని, వాస్తవానికి నీలాంటి దోపిడీదారుల వల్లే నష్టం జరుగుతుందన్నారు. పారిశ్రామికవేత్తలు రావడానికి భయపడుతున్నది వైఎస్‌ కుటుంబం లాంటి దోపిడీదారులకు భయపడేనని చెప్పారు. ముఖ్యమంత్రిగాఉండి హైదరాబాద్‌లో ఇష్టానుసారంగా దోపిడీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌ మరింత అభివృద్ది జరుగుతుందని వినోద్‌ పేర్కొన్నారు. రాజకీయాలపై జగన్‌కు అవగాహనలేదని ఆయన విమర్శించారు. రావినారాయణరెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నామని, అయినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *