
హైదరాబాద్, నవంబర్ 8 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందే తెలంగాణ పీసీసీ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబును నియమించనున్నట్లు తెలిసింది. ఈమేరకు శ్రీధర్‌బాబు శుక్రవారం ఉదయమే ఢిల్లీకి చేరుకున్నా కనీసం ఏపి భవన్‌కు గాని మంత్రులు, ఎంపిల ఇళ్లకు గాని వెళ్లిన దాఖలాలు లేవు. ఆయనను అధిష్టానం కావాలనే పిలిపించి సీక్రెట్‌గా ఉంచినట్లు ప్రచారం ఊపందుకోవడంతో ఏం జరుగబోతోందని తలలు పట్టుకుంటున్నారు కాంగ్రెస్‌కు చెందిన ఇరుప్రాంతాల నేతలు. సమన్వయ కమిటీ సమావేశం తర్వాత సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని మార్చుతారని కూడా ఇప్పటికే లీకులు వచ్చాయి. ముఖ్యమంత్రి కోసం కేంద్ర రైల్వే మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఎంపిక దాదాపు పూర్తయిందని లీకులు వచ్చాయి. దీంతో కోట్ల వర్గీయులు కర్నూల్ జిల్లాకు చెందిన నేతలు ఆయన అనుచరులు మిఠాయిలు పంచుకోవడమే కాక వేడుకలు కూడా జరుపుకున్నారు. ఈ తరుణంలో మూడో కంటికి తెలియకుండా హైకమాండ్ మంత్రి శ్రీధర్‌బాబును ఢిల్లీకి పిలువడంతో అటు సీమాంధ్ర నేతలతో పాటు, తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా కలవరపడుతున్నారు. ఎవ్వరు ఢిల్లీ వెళ్లినా కూడా ఏపీ భవన్‌లోనే ఉండి కార్యక్రమాలు చేస్తుంటారు. అయితే గతంలో వైఎస్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయనను మార్చే విషయంలో కూడా డి.శ్రీనివాస్‌ను కూడా ఇలాగే ఢిల్లీకి పిలిపించి రాత్రికి రాత్రి మార్చి డి.శ్రీనివాస్‌కు అధికార పగ్గాలు కట్టబెట్టిన చరిత్ర కాంగ్రెస్‌కే ఉంది. ఈసారి జరుగుతున్న పరిణామాల్లో కూడా గత చరిత్రను రాజకీయ విశ్లేషకులు వెలుగులోకి తీసుకు వస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకున్నందున తెలంగాణకు ప్రత్యేక పిసిసిని ప్రకటించి, ఈపగ్గాలను శ్రీధర్‌బాబుకు అప్పగిస్తారా అనే అంశంపై కూడా ఢిల్లీతోపాటు, రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల నేతలను ఊపిరి ఆడకుండా చేస్తోంది. రెండుఅంశాలపై కాంగ్రెస్‌వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి.మంత్రి శ్రీధర్‌బాబు అనుచరులు కాని కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలు సైతం మంత్రికి మంచి పదవిని కట్టబెట్టేందుకే ఆయనను పిలిచినట్లుగా అనిపిస్తుందంటున్నారు. శ్రీధర్‌బాబు కుటుంబం కూడా కాంగ్రెస్‌కు ఎంతో సన్నిహితంగానే కాకుండా పార్టీ అడుగు జాడల్లోనే కొనసాగిన చరిత్ర ఉండనే ఉందంటున్నారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న శ్రీధర్‌బాబు ఢిల్లీ పర్యటన వివరాలు జిల్లా వాసులకు కూడా తెలియక పోయినా ఏదో మంచి పదవితో వస్తారనే ఊహాగానాల్లో ఉన్నారనేది వాస్తవం.
తెలంగాణ పీసీసీ చీఫ్‌గా శ్రీధర్‌బాబు!




