Tuesday, 3 November 2026

కిరణ్‌ కొత్తపార్టీ పేరు విడుదల నేడే!మాజీ ఎంపి సబ్బం హరి

విశాఖపట్నం, మార్చి 7: కొత్త పార్టీ పేరును శనివారం తిరుపతిలో కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడించనున్నట్టు మాజీ ఎంపి సబ్బం హరి అన్నారు. మీడియాతో శుక్రవారం సాయంత్రం మాట్లాడుతూ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చిత్తూరు జిల్లాకు వెళ్లనున్నారని, అక్కడే కొత్త పార్టీ పేరును వెల్లడిస్తారని తెలిపారు. సొంత జిల్లా నేతలతో కిరణ్‌ చర్చలు నిర్వహించనున్నారు. ఈ నెల 12న రాజమండ్రిలో జరగనున్న సభలో పార్టీ విధివిధానాలు, మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. కిరణ్‌పై మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ వ్యాఖ్యలు అవాస్తవాలని అన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి నిజాయితీపరుడు. పాలనలో పారదర్శకత తెచ్చేందుకు ఎంతో శ్రమించారు. రాష్ట్ర ఆదాయాన్ని ఇబ్బడిముబ్బడిగా పెంచారు. ఎటువంటి విచారణకైనా సిద్ధమేనని ఇటీవల ఆయన సవాల్‌ చేసిన విషయం తెలిసిందేనని అన్నారు. విభజనకు సహకరించిన వారే కిరణ్‌పై నిందలు మోపుతున్నారని అన్నారు. విభజన సమయంలో సమైక్యాంధ్ర కోసం ఎవరు ఎంత నటించింది.. ఎవరెవరు ఎలా నడుచు కుంది ప్రజలందరికీ తెలుసునన్నారు. ప్రజల కోసం త్రికరణశుద్దిగా ఎవరు పనిచేశారో ప్రజలందరికీ తెలిసిందేనని అన్నారు.  వారే తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *