తిరుపతి, ఏప్రిల్ 5 : తిరుపతి పట్టణంలో వెలిసిన శ్రీకోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆఖరి రోజైన శనివారం చక్రస్నానం కన్నుల పండువగా సాగింది. వేద పండితులు మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ చక్రతళ్వార్‌కు అభిషేకం నిర్వహించారు. కపిలతీర్థం పుష్కరిణిలో జరిగిన ఈ వేడకను చూసేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. తొమ్మిది రోజుల పాటుజరిగిన ఈ బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణతో ముగుస్తాయి. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు సుదర్శనచక్రతాళ్వార్‌కు ఘనంగా చక్రస్నానాన్ని అర్చక స్వాములునిర్వహించారు. అంతకుముందు ఏడు గంటలకు కోదండరామాలయం నుంచి సుదర్శన చక్రతాళ్వార్లను ఊరేగింపుగా ఆలయం నుంచి కపిలేశ్వర స్వామి ఆలయ పుష్కరిని వద్దకు మేళతాళాలతో తీసుకువచ్చారు. అటు తరువాత సీతాలక్ష్మణ, ఆంజనేయ సమేత కోదండరామస్వామి ఉత్సవ మూర్తులకు, సుదర్శన చక్రతాళ్వార్లకు అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. మూడుమార్లు చక్రతాళ్వార్లను పుష్కరిణిలో స్నానఘట్టాన్నినిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులకు పాలు, పెరుగు, కొబ్బరినీరు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి కర్పూర హారతిని నివేదించారు. భక్తులు చక్రస్నాన ఘట్టంలో పాల్గొని పుణ్యస్నానాలను ఆచరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ గోపాల్, జేఈఓ భాస్కర్, పెద్ద, చిన జీయంగార్లు, స్థానిక ఆలయాల డిప్యూటీ ఈఓ హరిందర్ , వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.




