Tuesday, 3 November 2026

ఆటో దూకుడుకు ఏడుగురు బలి

రాజమండ్రి: ఘోరమైన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మహిళలు సహా ఏడుగురు సభ్యులు మరణింగా, మరో నలుగురు గాయపడిన సంఘటన ఆదివారం కొత్తపేట మండలంలోని మొడెకుర్రు గ్రామానికి చెందిన గొల్లకోటివారిపాళెం కుగ్రామం సమీపంలో కెనాల్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది. రావులపాళెం వెళుతున్న ఒక ఆటోను ఆర్టీసీ బస్సు వెనుక వైపు నుంచి రాగా అమలాపురం వెళుతూ ఎదురుగా వచ్చిన ఒక వ్యాన్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతకు ఆటో నుజ్జనుజ్జ అయిపోయింది.ఉప్పలగుప్తం మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన 11 మంది సభ్యుల చాట్ల దుర్గారావు కుటుంబం ఆయన సోదరి లంకా పార్వతి నివాసంలో ఒక వేడుకకు హాజరుకావడానికి రావులపాలెం మండలంలోని ముమ్మడివరప్పాడు గ్రామానికి బయలుదేరింది. వారు ప్రయాణిస్తున్న ఆటో ఒక బస్సు వెనకాల వెళుతోంది. కెనాల్ రోడ్డు వద్ద ఆ బస్సు ఆగడంతో ఆటో డ్రైవర్ బస్సును ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించడంతో ప్రమాదం జరిగింది. మృతులను చాట్ల దుర్గారావు(40), చాట్ల దుర్గ(35), చాట్ల బాలకృష్ణ(35), చాట్ల నాగమణి(40), చాట్ల నాని(10), చాట్ల పాపమ్మ(60), టి.మంగ(45) గుర్తించారు. గాయపడినవారిలో చాట్ల పల్లమ్మ(40), చాట్ల వెంకటేశ్వరరావు(65), చాట్ల బాబ్జీ(3), చాట్ల జ్యోతి(5) ఉన్నారు. సమాచారం అందుకున్న రావులపాలెం ఇన్‌స్పెక్టర్ ఎం.సుధాకర్ రావు, కొత్తపేట ఎస్ఐ బాలాజీ హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకున్నారు. గాయపడినవారిని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్ళడానికి అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. మృతదేహాలను శవపరీక్ష కోసం కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.అమలాపురం ఎంపీ జి.వి.హర్షకుమార్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంద్ రావు, మాజీ ఎమ్మెల్యే సిహెచ్.జగ్గిరెడ్డి, టిడిపి నాయకుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, ఇతర పార్టీల నాయకులు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకున్నారు. గాయపడినవారిని తరలించే ఏర్పాట్లును పర్యవేక్షించారు. కేసు నమోదు చేసుకున్న కొత్తపేట పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *