లైసెన్సు ఫీజు ఎక్కువ కావడం.. బెల్టు దుకాణాలు రద్దవడంతో తమకు పెద్దగా లాభించదనుకున్న వ్యాపారులు వెనక్కు తగ్గారు. మిగిలిపోయిన మద్యం దుకాణాలు ఎక్కువగా తూర్పుగోదావరిలోనే ఉన్నాయి. ఇక్కడ 156 దుకాణాలకు వ్యాపారులు అసలు దరఖాస్తులే వేయలేదు. మద్యం దుకాణాలను దక్కించుకున్న వ్యాపారులు నిర్ణీత లైసెన్సు ఫీజును విడతల వారీగా చెల్లించాల్సి ఉంటుంది. దీనికోసం వారు నిర్ణీత గడువులోగా బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలి. డ్రా నిర్వహించిన మద్యం దుకాణాల ద్వారా ప్రభుత్వానికి లైసెన్సు ఫీజుల రూపంలోనే రూ.122 కోట్ల ఆదాయం లభించినట్టు ఎక్సైజ్ వర్గాలు పేర్కొన్నాయి. గతేడాది రాష్ట్రం మొత్తం మీద 23 జిల్లాలకు కలిపి రూ.175 కోట్లు లైసెన్సు ఫీజుల రూపంలో వస్తే ఈసారి కేవలం 13 జిల్లాల్లోనే రూ.122 కోట్లు రావడంతో ఎక్సైజ్ శాఖ ఆనందంలో మునిగిపోయింది. మిగిలిన 740 దుకాణాలకు కూడా దరఖాస్తులు వస్తే వాటి ద్వారా కూడా మరికొంత లైసెన్సు ఫీజు రావచ్చని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
ఆదాయం మత్తెక్కింది!
హైదరాబాద్, జూన్ 28: ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో ఉన్న మద్యం దుకాణాలకు శనివారం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన లక్కీ డ్రా ముగిసింది. ఓ వైపు బెల్టు దుకాణాలు రద్దయినా.. లైసెన్సు ఫీజు పెంచినా.. మద్యం దుకాణాలకు పోటీ ఏమాత్రం తగ్గలేదు. మద్యంపైనే తమకు ఎక్కువ లాభాలు వస్తాయని ఆశించిన వ్యాపారులు పోటాపోటీగా డ్రాలో పాల్గొన్నారు. మొత్తం 4340 మద్యం దుకాణాలుండగా వీటన్నింటికీ జిల్లాల వారీగా అధికారులు డ్రా నిర్వహించారు. ఇందులో 3600 దుకాణాలను వ్యాపారులు పోటీపడి దక్కించుకున్నారు. నూతన మద్యం విధానాన్ని రూపొందించి ఈ నెల 23వ తేదీన ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈమేరకు వ్యాపారులు పోటాపోటీగా దరఖాస్తులు సమర్పించారు. మొత్తం 48 వేల దరఖాస్తులు రాగా ఇందులో కొందరినే లక్కు వరించింది. 3,600 దుకాణాలను వ్యాపారులు దక్కించుకోగా.. 740 మద్యం దుకాణాలు మిగిలిపోయాయి. వీటికి సోమవారం మరోసారి నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తూర్పుగోదావరి, చిత్తూరు, విశాఖపట్టణం జిల్లాల్లోని కొన్ని దుకాణాలపై వ్యాపారులు పెద్దగా ఆసక్తి ప్రదర్శించలేదు.




