Tuesday, 3 November 2026

విజయనగరంలో రైలు ప్రమాదం 8 మంది మృతి


హైదరాబాద్‌, నవంబర్‌ 3 (జనంసాక్షి) :
విజయనగరం జిల్లా కొట్లాం వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. శనివారం తెల్లవారుజామున అలెస్పీ(బొకారో) ఎక్స్‌ప్రెస్‌ రైలు కొట్లాం వద్దకు చేరుకుంది. యశ్వంత్‌ బోగీలో పొగలు రావడంతో షార్ట్‌సర్క్యూట్‌ జరిగిందని ప్రయాణికుల్లో అలజడి ప్రారంభమైంది. దీంతో కొందరు చైన్‌ లాగారు. షార్ట్‌ సర్క్యూట్‌ అన్న ప్రచారం రైలంతా వ్యాపించడంతో ప్రయాణికులంతా గగ్గోలు పెట్టారు. ఎవరికి వారు రక్షించుకునే ప్రయత్నంలో రైలు నుంచి దూకారు. దీంతో పక్కనున్న రైల్వే ట్రాక్‌పై వస్తున్న విజయవాడ ప్యాసింజర్‌ రైలు అటుగా వస్తుండడంతో ఆ రైలు కింద ప్రయాణికులు పడిపోయారు. ఆరు బోగీల నుంచి ప్రయాణికులు బయటకు దూకారు. దీంతో ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు చెందిన ఏడుగురు మృత చెందగా, బొబ్బిలికి చెందిన మరో ప్రయాణికుడు చనిపోయాడు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన వారు. చనిపోయిన వారిలో రెండేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. మృతుల్లో శ్వేతసింగ్‌, కార్తీక్‌ సాహు, లోకేంద్ర కుమార్‌, అలక్ష్యసత్తు, సంహిత కుమారి, పారాదేవి ఉన్నారు. మరో మృతదేహాన్ని గుర్తించాల్సి ఉంది. వీటిని రైల్వే ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించగా గాయపడినవారిని చికిత్స అందించారు. అర్దరాత్రి సమయం కావడంతో ప్రయాణికులకు ఏమీతోచక చీకటిలోనే అయోమయానికి లోనై కిందికి దూకడం, వీరు దూకిన ప్రాంతం మూలమలుపు కావడంతో పక్క ట్రాక్‌పై పడ్డారు. అదేసమయంలో వచ్చిన ప్యాసింజర్‌ రైలు వారిపై నుంచి దూసుకుపోవడంతో ఆ ప్రాంతమంతా మాంసపు ముద్దలతో హృదయ విదారంగా కనిపించింది.
సీఎం సహా పలువురి దిగ్భ్రాంతి
విజయనగరం జిల్లా కొట్లాం రైలు ప్రమాదంపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కేంద్ర రైల్వేశాఖ మంత్రి మల్లికార్జున ఖర్ఘే మాట్లాడుతూ ఈ ప్రమాదం అత్యంతం దిగ్భ్రాంతికరమైనదని వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సంఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. అధికారులకు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు అన్ని రకాల వైద్య సేవలందించేందుకు వెనుకాడవద్దని ఆదేశాలు జారీ చేశారు. కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.  పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆదివారం రైలు ప్రమాద ఘటనను స్వయంగా చూశారు. అనంతరం చనిపోయిన, గాయపడిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాష్ట్రమంత్రి శత్రుచర్ల విజయరామరాజు ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి తీవ్ర వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర మంత్రి పురందేశ్వరి, విజయనగర, శ్రీకాకుళం ఎంపీలు బొత్స ఝాన్సీ, కిల్లి కృపారాణి, కేంద్ర మంత్రి కిశోర్‌చంద్రదేవ్‌ తదితరులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *