ఉపాధి పనుల్లో అవకతవకలుఫీల్డ్‌ అసిస్టెంట్‌ సస్పెన్షన్‌- రూ.70వేల రికవరీకి ఆదేశాలు

కాకినాడ, జూలై 23, :కాకినాడ రూరల్‌ నియోజకవర్గ పరిధిలోని కాజూలూరు మండలంలో నిర్వహించిన ఉపాధి పనుల్లో అవకతవకలు జరిగినట్టు సామాజిక తనిఖీలో వెల్లడైంది. 2011-12 ఉపాధి పనులను సామాజిక తనిఖీ బృందం తనిఖీ చేసి అవకతవకలను గుర్తించింది. చేదువాడ, పెనుమళ్ళ, మతుకుమిల్లి మంజేరు గ్రామాల్లో చనిపోయిన వారికి సుమారు రూ.4,800లు చెల్లించినట్టు గుర్తించారు.ఉపాధి సిబ్బంది సరిగ్గా వ్యవహరించకపోవడంతో రూ.4100ను జరిమానాగా విధించినట్టు,ఉపాధి పనుల్లో అవకతవకలపై రూ.63951లను తిరిగి చెల్లించాలని ఆదేశించారు. ఈ సామాజిక తనిఖీలో సుమారు 1600 పనులు జరిగాయని అయితే దుగ్గుదూరులో మస్తర్ల విషయంలో భారీ అవకతవకలు జరిగినట్టు గుర్తించి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ను సస్పెండ్‌ చేశారు.పెనుమళ్లలో చెరువు తవ్వకాల్లో అవకతవకలు జరిగినట్టు గ్రామస్తులు ఆరోపించడంతో విచారణకు ఆదేశించి,పూర్తి విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్టు ఎంపిడిఓ తెలిపారు.