బారకాన్, నెల్లూరు: దేశవ్యాప్తంగా మోడీ ప్రభావాన్ని ఎవరూ ఆపలేరని కాంగ్రెస్ ఎన్ని కుట్రలు పన్నినా అవి వృథాయేనని భాజపా జాతీయ నాయకుడు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. నెల్లూరులో ఆయన గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆగస్టులో హైదరాబాద్‌లో నవభారత్ సమ్మేళన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శత్రుదేశమైన పాకిస్థాన్ టెర్రరిస్టులు రకరకాల పేర్లతో దేశంలో ఎన్ని విధ్వంసాలు సృష్టించినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోగా ఆర్‌ఎస్‌ఎస్‌పై నిందమోపే ప్రయత్నం చేస్తోందంటూ ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మద్యం ఏరుల్లా పారిందని కొన్ని ప్రాంతాల్లో 500 నుంచి రూ. 2వేల వరకు ఓటుకోసం పంపకాలు చేశారని, ఈ పరిస్థితి రావడం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు దేవుడికి కొట్టిన టెంకాయ డబ్బులు కూడా స్థానికులు ఇచ్చేవారన్నారు. గుంటూరు జిల్లా తెనాలి మున్సిపాలటీకి సంబంధించిన రామకృష్ణ అనే తెదేపా మాజీ ఫ్లోర్ లీడర్, ఆయన వర్గీయులు ఈ రోజు వెంకయ్యనాయుడు సమక్షంలో భాజపా తీర్థం పుచ్చుకున్నారు.




